1 Samuel 27

1తరువాత దావీదు<<నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ఏదో ఒకరోజు సౌలు నన్ను నాశనం చేస్తాడు. నేను ఫిలిష్తీయుల దేశంలోకి తప్పించుకొని వెళ్తాను. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకడం మానివేస్తాడు. నేను అతని చేతిలోనుండి తప్పించుకోవచ్చు>> అని మనసులో అనుకొని

2లేచి తన దగ్గర ఉన్న 600 మందితో కలసి ప్రయాణమై మాయోకు కొడుకు, గాతు రాజు అయిన ఆకీషు దగ్గరకు వచ్చాడు.

3దావీదు గాతులో ఆకీషు దగ్గరకు చేరినప్పుడు అతడూ, అతని వారంతా తమ తమ కుటుంబాల సమేతంగా కాపురాలు పెట్టారు. యెజ్రెయేలీయురాలైన అహీనోయము, ఒకప్పుడు నాబాలు భార్యయైన కర్మెలీయురాలు అబీగయీలు అనే అతని ఇద్దరు భార్యలు దావీదుతో ఉన్నారు.

4దావీదు గాతుకు పారిపోయిన విషయం సౌలుకు తెలిసిన తరువాత అతడు దావీదును వెదకడం ఆపివేశాడు.

5దావీదు, <<రాజ నగరులో నీ దగ్గర నీ దాసుడనైన నేను కాపురం చేయడం ఎందుకు? నాపై నీకు అభిమానం ఉంటే వేరొక పట్టణంలో నేను కాపురం పెట్టడానికి కొంచెం స్థలం ఇప్పించు>> అని ఆకీషును అడిగితే, 6ఆ రోజు ఆకీషురాజు సిక్లగు అనే పట్టణాన్ని దావీదుకు ఇచ్చాడు. కాబట్టి ఇప్పటివరకు సిక్లగు యూదారాజుల ఆధీనంలో ఉంది.

7దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉన్న కాలం మొత్తం ఒక సంవత్సరం నాలుగు నెలలు.

8తరువాత దావీదు, అతనివారు బయలుదేరి గెషూరీయుల మీదా, గెజెరీయుల మీదా అమాలేకీయుల మీదా దాడి చేశారు. ఇంతకుముందు ఈ జాతులు ప్రయాణికులు నడిచే మార్గంలో షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్న దేశంలో నివసించారు. 9దావీదు ఆ దేశాల వారిని చంపి, పురుషులు, స్త్రీలు ఎవ్వరినీ బతకనీయకుండా చంపి వారి గొర్రెల్నీ ఎద్దుల్నీ గాడిదల్నీ ఒంటెల్నీ బట్టల్నీ దోచుకొని తిరిగి ఆకీషు దగ్గరకు వచ్చేవాడు.

10అప్పుడు ఆకీషు<<ఇప్పుడు మీరు ఏ దేశంపై దండెత్తి వచ్చారు?>> అని దావీదును అడిగితే, దావీదు, <<యూదా దేశానికి, యెరహ్మెయేలు దేశానికి, కేనీయ దేశానికి దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంపై దండెత్తాము>>అన్నాడు.

11ఆ విధంగా దావీదు చేస్తూ వచ్చాడు. దావీదు ఫిలిష్తీయ దేశంలో ఉన్నంతకాలం అతడు ఈ విధంగా చేస్తాడని తమను గురించి గాతుకు సమాచారం అందించగల పురుషులనైనా, స్రీలనైనా దావీదు బతకనివ్వలేదు. ఆకీషు దావీదును నమ్మాడు. <<దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తనను పూర్తిగా అసహ్యించుకునేలా చేశాడు కాబట్టి అతడు అన్నివేళలా నాకు దాసుడుగా ఉంటాడు>> అనుకొన్నాడు.

12

Copyright information for TelULB